BJP: ఇలా వచ్చి.. అలా సీఎంలుగా

👁 5

భాజపాలో ఆరెస్సెస్ నేపథ్యం లేని నేతల ఎదుగుదల

భాజపా అనగానే ఆరెస్సెస్ నేపథ్యమున్న నేతలే గుర్తుకొస్తారు. కానీ ఈ ఏడాది 4 రాష్ట్రాల్లో భాజపా నియమించిన ముఖ్యమంత్రులెవరికీ ఆరెస్సెస్తో సంబంధం లేదు. వీరంతా వివిధ పార్టీల నుంచి భాజపాలో చేరి అతి తక్కువ సమయంలో సీఎం పీఠాలను అందుకున్నారు. గతంలో మరో ఏడుగురు నేతలూ ఇలానే భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలయ్యారు.

కాంగ్రెస్లో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన సువేందు 1998లో ఆ పార్టీని వీడి మమతా బెనర్జీ ప్రారంభించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. 2020లో మమతతో విభేదాల కారణంగా ఆయన టీఎంసీని వీడి భాజపా తీర్థం పుచ్చుకున్నారు. కమల దళంలో చేరిన ఆరేళ్లలోనే సీఎం సీటు ఆయనను వరించింది.

2016 అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా భారీ విజయం సాధించి సర్బానంద సోనోవాల్ను సీఎంగా నియమించింది. ఆల్ అసోం స్టూడెంట్స్ యూనియన్తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సోనోవాల్ తర్వాత అసోం గణ పరిషత్లో చేరారు. విదేశీ చొరబాటుదారుల అంశంలో పార్టీ వైఖరి నచ్చక 2011లో భాజపాలో చేరారు.

అస్సాం ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణం చేస్తున్న హిమంత బిశ్వ శర్మ రాజకీయ జీవితం అసోం గణ పరిషత్తో ప్రారంభమైంది. ఆ తర్వాత కాంగ్రెస్లో చేరిన ఆయన 2015లో ఆ పార్టీని వీడి భాజపాలో చేరారు. 2021లో తొలిసారి ఆయనను ముఖ్యమంత్రి పదవి వరించింది.

బిహార్ తొలి భాజపా ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరీ గత నెల 15న ప్రమాణం చేశారు. ఆర్జేడీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2014లో జేడీయూలో చేరారు. 2018లో భాజపా తీర్థం పుచ్చుకున్న ఆయన సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ మూడు సార్లు సీఎంగా పని చేశారు. 2016 జులైలో కాంగ్రెస్ తరఫున తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన అదే ఏడాది సెప్టెంబరులో ఆ పార్టీని వీడి దాదాపు 43 మంది ఎమ్మెల్యేలతో కలిసి పీపీఏలో చేరారు. మూడు నెలల్లోపే పీపీఏ నుంచి విడిపోయి భాజపాలో చేరిన ఆయనను కమల దళం సీఎంగా నియమించింది. 2019, 2024లోనూ పెమాకు సీఎంగా అవకాశం లభించింది.

గెగాంగ్ అపాంగ్ చాలా కాలంపాటు అరుణాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014లో ఆయన తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరారు. ఫలితంగా ఈశాన్య భారత్లో తొలిసారి భాజపా ప్రభుత్వం ఏర్పడింది.

త్రిపుర సీఎం మాణిక్ సాహా రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీతోనే ప్రారంభమైంది. 2016లో కాంగ్రెస్ను వీడి భాజపా గూటికి చేరారు. 2022 మే 14న అప్పటి ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో మాణిక్ను పదవి వరించింది.

మణిపుర్లో తొలిసారిగా 2017లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భాజపా సీఎంగా ఎన్. బీరెన్ సింగ్ను నియమించింది. డెమోక్రటిక్ రివల్యూషనరీ పీపుల్స్ పార్టీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన కొన్నాళ్లకు కాంగ్రెస్లో చేరారు. 2016లో భాజపాలో చేరిన ఆయన 2017, 2022ల్లో ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

దక్షిణ భారత్లో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం కర్ణాటక. 2021 నుంచి 2023 వరకు ఆ రాష్ట్ర సీఎంగా బసవరాజ్ బొమ్మై సేవలందించారు. 1992లో జనతాదళ్తో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2021 జులై 26న యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో, సీఎంగా బసవరాజ్కు భాజపా అవకామిచ్చింది.

అర్జున్ ముండా తన రాజకీయ ప్రయాణాన్ని ఝార్ఖండ్ ముక్తి మోర్చాద్వారా ప్రారంభించారు. ఝార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఆయన 1990వ దశకం చివరలో జేఎంఎంను వీడి భాజపాలో చేరారు. 2003లో భాజపా తరఫున తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు.

💬 Yorumlar (0)

Yorum Yaz

Yorumunuz onaydan sonra yayınlanır.

Henüz yorum yok. İlk yorumu siz yazın.